శ్రీకృష్ణుడు గొల్లకురుమల రక్త బాంధవుడు
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..
ఉత్తర తెలంగాణలో గొల్ల కురుమల సాంస్కృతిక సమ్మేళనం..
ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ..
కాకతీయ, హన్మకొండ : ఉత్తర తెలంగాణలో శ్రీకృష్ణ జన్మాష్టమి రాష్ట్ర స్థాయి వేడుకలు శనివారం ఉత్సాహభరితంగా జరిగాయి. యాదవ వెల్ఫేర్ ట్రస్ట్-వరంగల్ ఆధ్వర్యంలో మాజీ కుడా చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ సమన్వయంతో హనుమకొండలో నిర్వహించిన ఈ వేడుకలు గొల్లకురుమల ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. జానపద కళాకారుల ప్రదర్శనలు, మహిళల బోనాలతో గోకుల్ నగర్ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా కాళోజీ కళాక్షేత్రం వరకు శ్రీకృష్ణుని శోభాయాత్ర వైభవంగా సాగింది.

వేలాది మంది భక్తులు పాల్గొన్న ఈ యాత్రలో సుమారు రెండు వేల గొల్లకురుమ యువత భాగమయ్యారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన సభకు హర్యానా మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను మరింత విశిష్టం చేశారు. ఈ సందర్భంగా యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు గొల్లకురుమల రక్త బాంధవుడు. ఆయన ధర్మ పరిరక్షకుడిగా దేశ చరిత్రలో నిలిచారు. ఈ సమాజం దేశ సంస్కృతి, చరిత్రలో విశిష్ట స్థానాన్ని పొందింది అని అన్నారు. యాదవుల వారసత్వంలో తిరుమల తిరుపతి తొలి దర్శనం, అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్మాణం, గోల్కొండ పాలన వంటి ఘనతలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ వేడుకల్లో శాసన మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం విజయభాస్కర్, ఎం. ధర్మారావు, వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, ఫెడరేషన్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీజేపీ నేతలు రావు పద్మారెడ్డి, గంటా రవికుమార్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు గిరబోయిన రాజయ్య యాదవ్, కార్పొరేటర్ జక్కుల రమా రవీందర్, యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు, సినీ, టీవీ కళాకారులు కోమలి, మల్లిక్ తేజ, యశోద, నక్క శ్రీకాంత్, అనిత, లావణ్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు. జనగాం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో గొల్లకురుమలు విచ్చేసి వేడుకలకు శోభను తీసుకువచ్చారు. రాజకీయాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలు భాగస్వాములవడం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


