అక్షయ పాత్ర సేవలు అనిర్వచనీయం
పేద విద్యార్థులకు ఆకలి తీర్చడం గొప్ప విషయం
ఆకలితో ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యం ప్రశంసనీయం
దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
ఎనుమాముల అక్షయ పాత్ర సెంట్రల్ హబ్‌లో అధునాతన యంత్రాల ప్రారంభం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పేద విద్యార్థుల ఆకలి తీర్చి, వారికి చదువుపై దృష్టి నిలబెట్టేలా చేస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు. వరంగల్ నగర పరిధిలోని 14వ డివిజన్ ఎనుమాముల ప్రాంతంలో ఇస్కాన్ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో సీఏస్ఆర్ నిధులతో, హెచ్‌డిబి సహకారంతో ఏర్పాటు చేసిన అధునాతన వంటశాల యంత్రాలను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్‌కు ఉన్న గుర్తింపు, పేరు ప్రతిష్ఠలు విశేషమని పేర్కొన్నారు. కృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఏర్పడిన ఈ సంస్థ ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవల రంగంలోనూ విశేషంగా పని చేస్తోందన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇస్కాన్‌కు అనుబంధ సంస్థగా బెంగళూరు కేంద్రంగా ప్రారంభమై, “ఆకలి కారణంగా ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదు” అనే ఉన్నత ఆశయంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం)లో భాగంగా నాణ్యమైన, రుచికరమైన, వేడి ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా అక్షయ పాత్ర పనిచేస్తోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతున్న సంస్థ ఇదేనని మంత్రి తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 22 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ 20 లక్షలకుపైగా విద్యార్థులకు ఆహారం అందిస్తున్నట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సేవలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
సేవతో పాటు విలువల బోధన
అవసరార్థులకు భోజనం అందించడమే కాకుండా, పిల్లల్లో కృష్ణ భక్తి, సత్ప్రవర్తన, మానవీయ విలువలు నాటేందుకు అక్షయ పాత్ర కృషి చేస్తోందన్నారు. “హరే రామ, హరే కృష్ణ” అనే నామస్మరణ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని, విదేశీయులు సైతం భారత్‌కు వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని మంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో ఆధునిక కిచెన్ యంత్రాల ఏర్పాటుకు సహకరించిన హెచ్‌డిబి యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ అభ్యర్థన మేరకు హైదరాబాద్‌లో కిచెన్ ఏర్పాటుకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు కూడా మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య తదితరులు పాల్గొన్నారు.



