వేములవాడలో భక్తుల రద్దీ
సమ్మక్క జాతర నేపథ్యంలో పెరిగిన భక్తులు
భీమేశ్వర స్వామి. బద్ది పోచమ్మ ఆలయాలకు పోటెత్తిన భక్తులు
కాకతీయ, వేములవాడ : సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయాల్లో ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, దర్శనాలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయాలను 24 గంటల పాటు దర్శనానికి అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్దకు చేరుకుని అమ్మవార్లను, స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. క్యూలైన్లను సక్రమంగా నిర్వహిస్తూ భక్తుల రద్దీని నియంత్రిస్తున్నారు.
ఈవో పర్యవేక్షణలో ఏర్పాట్లు
ఆలయ ఈవో ఎల్. రమాదేవి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు కేటాయించారు. శాంతి భద్రతలు, పరిశుభ్రత, దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్యూలైన్లలో తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు ఎండ తీవ్రత నుంచి భక్తులను రక్షించేందుకు టెంట్‌లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.100 శీఘ్ర దర్శనం, రూ.300 అతి శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు సుమారు 56,691 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏర్పాట్లను ఈవో స్వయంగా పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు జి.శ్రావణ్ కుమార్, జి.అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, విజయ్ కుమార్, వెల్ది సంతోష్, సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ సాయి కుమార్, ఓన్నారం భాస్కర్, పురాణం వంశీమోహన్ శర్మతో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.



