ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ చార్జిషీట్
దూకుడుగా సజ్జనార్ నేతృత్వంలోని సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు
ట్యాపింగ్ రివ్యూ కమిటీ సభ్యుల మరోసారి విచారణ
ముగ్గురు మాజీ సీఎస్‌లు, ఐఏఎస్, ఐపీఎస్‌ల స్టేట్మెంట్లు
రాజకీయ, వ్యాపార, మీడియా వర్గాల ఫోన్ల ట్యాపింగ్‌పై స్పష్టత
కాకతీయ, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. దీంతో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ట్యాపింగ్ రివ్యూ కమిటీలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులను సిట్ మరోసారి విచారించింది. అప్పట్లో ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్ రావు హయాంలో రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉన్న జీఏడీ సెక్రటరీ, మాజీ సీఎస్‌లు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ముగ్గురు మాజీ ఐఏఎస్‌లతోపాటు మాజీ ఐపీఎస్ అధికారులను సాక్షులుగా విచారించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఈ అధికారులు పోషించిన పాత్రపై సిట్ పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
ముగ్గురు సీఎస్‌లతో విచారణ
మాజీ సీఎస్‌లు సోమేశ్‌కుమార్, శాంతి కుమారిలతోపాటు సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్‌రావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్‌ను సిట్ విచారించింది. ఎస్ఐబీ ఓఎస్డీగా ప్రభాకర్ రావు నియామకంపై అప్పట్లో తీసుకున్న నిర్ణయాలపై ఐఏఎస్‌లను ప్రశ్నించినట్లు తెలిసింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ప్రభాకర్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను యథావిధిగా హోంశాఖకు ఈ మాజీ ఐపీఎస్ అధికారులు పంపినట్లు వెల్లడైంది. ఈ ఆధారాలతో అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో చార్జ్‌షీట్ వేయాలని సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశించిన విషయం తెలిసిందే.
రంగంలోకి సిద్ధిపేట సీపీ
ఇదిలా ఉండగా, ప్రభాకర్ రావు కస్టడీ విచారణ మూడో రోజుకు చేరింది. ఆయన్ని విచారించేందుకు సిట్ సభ్యుడైన సిద్ధిపేట సీపీ విజయ్‌కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావును విజయ్‌కుమార్ విచారించనున్నారు. గతంలో ఇదే కేసులో పలుమార్లు ఆయనే విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక పరిణామాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది.


