గణితంతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
జీవితంలోని ప్రతి దశలో గణితానికి కీలక పాత్ర
మరిపెడ జడ్పీహెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులు అనంతరావు
ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు
కాకతీయ, మరిపెడ : గణితమే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసే శక్తివంతమైన సాధనమని మరిపెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు పేర్కొన్నారు. సోమవారం పాఠశాల ప్రాంగణంలో గణిత విజ్ఞాన వేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినీలు గణిత ప్రాధాన్యతను చాటే రంగవల్లులు, గణిత సూత్రాలు, ఆకృతులతో కూడిన ముగ్గులను వేసి పాఠశాల ఆవరణను ఆకర్షణీయంగా మలిచారు. గణితాన్ని కళారూపంలో ప్రదర్శించడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి పెరిగిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. నిత్యజీవితంలోని ప్రతి అంశంలో గణితానికి ప్రాధాన్యత ఉందన్నారు. లెక్కలు, కొలతలు, అంచనాలు వంటి గణిత చతుర్విధ ప్రక్రియలు ప్రతి రంగంలో ఉపయోగపడతాయని తెలిపారు. గణితం కేవలం ఒక పాఠ్యాంశమే కాకుండా, విజ్ఞానశాస్త్రాలకు మూలాధారమని పేర్కొన్నారు. గణితంపై పట్టు సాధిస్తే విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు పోటీ పరీక్షల్లోనూ రాణించగలరని సూచించారు.
ఉపాధ్యాయులకు సన్మానం
ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు రమేష్ రెడ్డి, ప్రసాదరావు, బాబురావులను ప్రధానోపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయినీ–ఉపాధ్యాయులు, విద్యార్థినీ–విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


