మీ నమ్మకాన్ని వమ్ము చేయబోను
గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం
ఏకగ్రీవ ఎన్నిక ఎంతో సంతోషం
: నూతన సర్పంచ్ కొండం రంగారెడ్డి
కాకతీయ, రాయపర్తి : గ్రామ ప్రజలు నాపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి విశ్వాసాన్ని వమ్ము చేయబోనని కిష్టాపురం నూతన సర్పంచ్ కొండం రంగారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి వీరగోని శృతి ఆయనతో సర్పంచ్‌గా ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజలందరూ ఏకమై తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ పదవిని అధికారంగా కాకుండా గ్రామ ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశంగా భావిస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రతి రూపాయిని గ్రామ అవసరాలకే వినియోగిస్తానని హామీ ఇచ్చారు.
పారదర్శక పాలనకు హామీ
గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, వీధి దీపాల ఏర్పాటు, అంతర్గత మురికి కాలువల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ కలుపుకుని, నిష్పక్షపాతంగా పారదర్శక పాలన అందిస్తానని స్పష్టం చేశారు. గ్రామ సమస్యలపై రాజీ లేకుండా పోరాడుతూ, కిష్టాపురాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సజ్జన్, ఎన్నికైన వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సర్పంచ్‌ను ఘనంగా సన్మానించారు.


