పాముకాటుతో అన్నదాత మృతి
పొలంలో పనిచేస్తుండగా విష సర్పం కాటు
కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లి గ్రామంలో పాముకాటుతో ఓ రైతు మృతి చెందిన విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… లెంకాలపల్లి గ్రామానికి చెందిన యాదండ్ల చిన్న కొమురయ్య (50) శుక్రవారం తన వ్యవసాయ భూమిలో మక్కజొన్న పంట పనులు చేస్తూ ఎడ్లకు మేత వేస్తున్న సమయంలో విషసర్పం చేతికి కాటు వేసింది. అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమించడంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య అరుణ, కుమారులు మునేందర్, రాజేందర్ ఉన్నారు. కుటుంబానికి అన్నదాతగా ఉన్న చిన్న కొమురయ్య మృతి చెందడంతో లెంకాలపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్సై వి. గోవర్ధన్ తెలిపారు.


