గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యం
సర్పంచ్‌తో సమన్వయంతో పనిచేస్తా
చర్లపల్లి ఉపసర్పంచిగా ఎంఎస్ రెడ్డి ప్రమాణ స్వీకారం
కాకతీయ, నడికూడ : నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలో నూతన ఉపసర్పంచిగా మామిడాల శ్రీనివాసరెడ్డి (ఎంఎస్ రెడ్డి) సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన రెండో వార్డు సభ్యుడైన ఎంఎస్ రెడ్డిని గ్రామ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఉపసర్పంచిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు అధికారికంగా చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఉపసర్పంచిగా బాధ్యతలు అప్పగించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు, వార్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని, ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సమస్యల పరిష్కారం, డ్రైనేజీల అభివృద్ధి, రహదారుల మరమ్మతులు వంటి అంశాలపై దృష్టి సారిస్తానని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్‌తో సమన్వయంగా పనిచేస్తూ ప్రతి వార్డు సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు. గ్రామంలో ఇటీవల తీవ్ర సమస్యగా మారిన కోతుల బెడద నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజల సహకారం, పాలకవర్గ సభ్యుల సమిష్టి కృషితో చర్లపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎంఎస్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొని నూతన ఉపసర్పంచికి శుభాకాంక్షలు తెలిపారు.


