నల్లబెల్లిలో కొలువు తీరిన నూతన సర్పంచులు
కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. గ్రామాభివృద్ధిపై ఆశలతో ప్రజలు ఎదురుచూస్తున్న వేళ, బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే అనేక సమస్యలు నూతన పాలకవర్గాన్ని వెంటాడుతున్నాయి. త్రాగునీటి కొరత, పారిశుధ్య లోపాలు, డ్రైనేజీల అస్తవ్యస్థత, కోతుల బెడద, వీధి కుక్కల సమస్యలు గ్రామాల్లో ప్రధాన సమస్యలుగా మారాయి. అంతేకాకుండా గత రెండేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఈ సమస్యల పరిష్కారమే నూతన సర్పంచుల ముందున్న ప్రధాన సవాల్‌గా నిలిచింది. ఇదే సమయంలో మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌గా మెజార్టీతో ఎన్నికైన నాగెల్లి జ్యోతి–ప్రకాష్, ఉపసర్పంచ్‌గా గుమ్మడి వేణు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి, మాజీ సర్పంచ్ రాజారాం, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


