లోక్ అదాలత్‌లో 4,881 కేసుల పరిష్కారం
రూ.82 లక్షలకు పైగా సైబర్ నేర బాధితులకు రిఫండ్
వరంగల్ కమిషనరేట్‌కు రాష్ట్రస్థాయిలో 6వ స్థానం
కాకతీయ, హన్మకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 4,881 కేసులు పరిష్కరించబడినట్లు ఆయన వెల్లడించారు. పరిష్కరించిన కేసుల్లో 700 ఎఫ్‌ఐఆర్ కేసులు, 1,669 ఎన్‌సీ (పెట్టీ) కేసులు, డ్రంకెన్ అండ్ డ్రైవ్, మోటార్ వాహనాల చట్టానికి సంబంధించిన 2,291 కేసులు, అలాగే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద 61 కేసులు ఉన్నాయని వివరించారు.లోక్ అదాలత్‌లో భాగంగా 159 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కారం కాగా, ఆయా కేసులకు సంబంధించి వివిధ బ్యాంకు ఖాతాల్లో నిలిపివేసిన రూ.82,65,306 మొత్తాన్ని బాధితులకు తిరిగి చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ తెలిపారు. ఇది సైబర్ నేర బాధితులకు పెద్ద ఊరటగా మారిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక కేసులు పరిష్కరించిన కమిషనరేట్‌లలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ 6వ స్థానం, ఎఫ్‌ఐఆర్ కేసుల పరిష్కారంలో 4వ స్థానం సాధించిందని తెలిపారు. “రాజీ మార్గం రాజ మార్గం” అన్న నినాదంతో లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు న్యాయం చేకూరుతుందని ప్రజలకు అవగాహన కల్పిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు. ఈ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడంలో సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయ సేవాధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


