భారత్–న్యూజిలాండ్ సూపర్ డీల్
95% ఉత్పత్తులపై టారిఫ్ కట్!
భారత్–న్యూజిలాండ్ ఎఫ్‌టీఏకు గ్రీన్ సిగ్నల్
9 నెలల్లోనే చరిత్రాత్మక ఒప్పందం
తొలిరోజే సగానికి పైగా ఉత్పత్తులపై సుంకం జీరో
ఇరు దేశాలకు భారీ వాణిజ్య లాభాలు
కాకతీయ, నేషనల్ డెస్క్ : భారత్–న్యూజిలాండ్ మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కేవలం 9 నెలల రికార్డు సమయంలోనే ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)ను పూర్తి చేసి అధికారికంగా ముద్ర వేశాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందంతో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు వచ్చే 95 శాతం ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గిపోనున్నాయి లేదా పూర్తిగా రద్దు కానున్నాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మధ్య ఫోన్ ద్వారా జరిగిన చర్చల అనంతరం ఈ సూపర్ డీల్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో 2025 మార్చిలో లక్సన్ భారత్ పర్యటన సందర్భంగా జరిగిన చర్చలే ఈ ఒప్పందానికి పునాది వేసినట్లు సమాచారం.
తొలిరోజే సుంకం లేని దిగుమతులు
ఈ ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన తొలి రోజే న్యూజిలాండ్ నుంచి భారత్‌కు వచ్చే సగానికి పైగా ఉత్పత్తులు సుంకం లేకుండానే అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల భారత్‌లో వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి వినియోగదారులకు న్యూజిలాండ్ ఉత్పత్తులు మరింత చౌకగా, సులభంగా లభించనున్నాయి. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన మార్కెట్ కావడంతో న్యూజిలాండ్ ఎగుమతిదారులకు ఇది బంగారు అవకాశంగా మారనుంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, డెయిరీ, మాంసాహారం, వైన్ వంటి రంగాలకు భారత్ కీలక మార్కెట్‌గా అవతరించనుంది. ఈ ఒప్పందం న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థకు భారీ బూస్ట్ ఇవ్వనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆసియా–పసిఫిక్‌లో భారత్‌కు బలం
భారత్–న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడమే కాకుండా, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రాధాన్యతను మరింత బలపరిచే కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ ఒప్పందంపై స్పందించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ,
“భారత్‌తో ఎఫ్‌టీఏ పూర్తైన తర్వాత ప్రధాని మోదీతో మాట్లాడాను. ఈ ఒప్పందం వల్ల న్యూజిలాండ్ నుంచి భారత్‌కు వెళ్లే 95 శాతం ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి లేదా పూర్తిగా తొలగిపోతాయి. వాణిజ్యం పెరగడం అంటే మా దేశంలో కొత్త ఉద్యోగాలు, మెరుగైన జీతాలు, ప్రజలకు కొత్త అవకాశాలు” అని వ్యాఖ్యానించారు.


