రష్యా సైన్యంలో 202 మంది భారతీయులు!
ఉక్రెయిన్ యుద్ధంలో 26 మంది మృతి
ఏడుగురు గల్లంతు… 50 మంది విడుదల కోసం ప్రయత్నాలు
119 మందిని స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్రం
విదేశాంగ శాఖ వెల్లడి
కాకతీయ, నేషనల్ డెస్క్ : రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన యుద్ధంగా భావిస్తున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 202 మంది భారతీయులు రష్యన్ సాయుధ దళాలలోకి నియమించబడ్డారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 26 మంది భారతీయులు మరణించగా, మరో ఏడుగురు గల్లంతైనట్లు రష్యా అధికారులు నివేదించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వివరాలను ఎంపీలు సాకేత్ గోఖలే, రణదీప్ సింగ్ సుర్జేవాలా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పార్లమెంటులో వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన సమిష్టి దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఇప్పటివరకు 119 మంది భారతీయులను ముందస్తుగా విడుదల చేయించగలిగామని, మిగిలిన 50 మంది భారతీయుల విడుదల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో మరణించిన ఇద్దరు భారతీయుల మృతదేహాలు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మరుసటి రోజైన డిసెంబర్ 17న ఈ సమాధానం ఇవ్వడం గమనార్హం.
యుద్ధ ప్రాంతాలకు వెళ్లొద్దన్న హెచ్చరిక
భారతీయులను ప్రలోభపెట్టి లేదా మోసపూరిత మార్గాల్లో రష్యా సైన్యంలో చేర్చి యుద్ధరంగానికి పంపుతున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే రష్యా–ఉక్రెయిన్ వివాదానికి దూరంగా ఉండాలని భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. జనవరిలో కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం, అప్పటివరకు కనీసం 12 మంది భారతీయులు మృతి చెందగా, 16 మంది గల్లంతయ్యారు. ఆగస్టు 2024లో రష్యన్ సాయుధ దళాలలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయులు మరణించినట్లు కేంద్రం తెలిపింది.
ఫిబ్రవరి 2022 నుంచి యుద్ధం
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 2022లో ప్రారంభమైంది. ఉక్రెయిన్ నాటో (NATO)లో చేరేందుకు ప్రయత్నించడమే ఈ యుద్ధానికి కారణమని రష్యా పేర్కొంటూ తన పొరుగుదేశంపై దాడికి దిగింది.
అక్టోబర్‌లో గుజరాత్‌కు చెందిన మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ కేవలం మూడు రోజుల పాటు ఫ్రంట్‌లైన్‌లో ఉన్న తర్వాత ఉక్రెయిన్ దళాలకు లొంగిపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. స్టడీ వీసాపై రష్యాకు వెళ్లిన అతడిని మాదకద్రవ్యాల ఆరోపణలపై అరెస్టు చేసి ఏడేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. జైలు శిక్ష అనుభవించేందుకు ఇష్టపడక, “ప్రత్యేక సైనిక ఆపరేషన్”లో పాల్గొనే ఒప్పందంపై అతడు సంతకం చేసినట్లు వెల్లడైంది. ఇటీవలి మరణాల్లో రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల అజయ్ గొడారా కూడా ఉన్నారు. విద్యార్థి వీసాపై రష్యాకు వెళ్లిన అతడిని బలవంతంగా సైన్యంలో చేర్చారని, సెప్టెంబర్ 2025లో నెట్స్క్‌లోని సెలిడోవ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో అతడు మరణించినట్లు సమాచారం.


