ధాన్యం ఇలా… వెళ్లేది ఎలా?
ప్రమాదకర మూలమలుపులపై వరి ధాన్యం
రాత్రివేళ వాహనదారులకు పెను ప్రమాదం
ధాన్యం చుట్టూ రాళ్లు… భయాందోళనలో ప్రయాణికులు
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్
కాకతీయ, ఆత్మకూరు : ప్రయాణికులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగేలా రైతులు రహదారి మూల మలుపులపై వరి ధాన్యం పోసి ఆరబెడుతుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాలు వెళ్లే సమయంలో ఇది ప్రాణాపాయంగా మారుతోందని వారు చెబుతున్నారు. సోమవారం ఆత్మకూరు మండలంలోని కామారం నుంచి పెంచికలపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై కొందరు రైతులు రోడ్డు మూల మలుపుల వద్ద వరి ధాన్యం పోసినట్లు వాహనదారులు తెలిపారు. మూల మలుపు కావడంతో ముందుగా కనిపించకపోవడం వల్ల వాహనాలు ఒక్కసారిగా ధాన్యంపైకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
రాత్రి వేళ ప్రమాదం తప్పదు!
రాత్రి సమయంలో సరైన వెలుతురు లేకపోవడంతో ధాన్యం ఉన్న విషయం గమనించకపోతే ప్రమాదం తప్పదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం చుట్టూ పెద్ద పెద్ద రాళ్లు పెట్టడంతో అటువైపు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ధాన్యం రోడ్లపై ఆరబెట్టకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎలాంటి అపశృతి జరగకముందే సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


