యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలి
రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
యూరియా పంపిణీలో పారదర్శకతే లక్ష్యం
గ్రోమోర్ ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ
బుకింగ్ ఐడీ కాలమ్‌తో రిజిస్టర్ నిర్వహణకు ఆదేశం
కాకతీయ, జనగాం : రైతులకు యూరియా ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ యాప్‌ను ప్రతి రైతు తప్పనిసరిగా వినియోగించాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టం చేశారు. ఈ యాప్‌పై క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం జనగాం పట్టణంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా యాప్ ద్వారా ఇప్పటివరకు జరిగిన అమ్మకాలను సంబంధిత రిజిస్టర్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి డీలర్ తప్పనిసరిగా యూరియా అమ్మకాల రిజిస్టర్ నిర్వహించాలని, ఇందులో కొత్తగా ‘బుకింగ్ ఐడీ’ అనే కాలమ్‌ను ఏర్పాటు చేసి, యాప్ ద్వారా జరిగిన అమ్మకాల పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
అవకతవకలకు చెక్
ఈ యాప్ ద్వారా ఎరువులు సమయానికి, అవసరానికి తగ్గట్టుగా, ఎలాంటి అవకతవకలు లేకుండా రైతులకు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు. రైతులు ముందుగానే యూరియాను బుక్ చేసుకోవడం వల్ల అనవసరంగా ఎరువుల దుకాణాల వద్ద గుమిగూడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. అలాగే ఒక రైతు ఒకే చోట లేదా పలు చోట్ల పునరావృతంగా యూరియా కొనుగోలు చేయకుండా నియంత్రణ సాధ్యమవుతుందని వివరించారు.
100 శాతం పారదర్శకత
యాప్ ఆధారిత బుకింగ్ విధానం ద్వారా యూరియా పంపిణీలో న్యాయమైన కేటాయింపు, బ్లాక్ మార్కెటింగ్ నివారణ, 100 శాతం పారదర్శకత సాధ్యమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని రైతులందరూ ఈ యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని, ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.
యూరియా ఎరువుల బుకింగ్ విధానం
ప్లే స్టోర్ నుంచి Fertilizer Booking App డౌన్‌లోడ్
మొబైల్ నంబర్‌తో లాగిన్, OTP నమోదు
పట్టాదారు పాస్‌బుక్ (PPB) నంబర్ నమోదు
పంట వివరాల (Crop Booking) నమోదు
అనుమతించిన యూరియా సంచుల కోటా ఎంపిక
మండలం, డీలర్ ఎంపిక చేసి బుకింగ్ నిర్ధారణ
బుకింగ్ పూర్తయ్యాక Booking ID జనరేట్
ఆ IDతో డీలర్ వద్ద యూరియా పొందడం
ఈ తనిఖీ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ అపర్ణ, టెక్నికల్ ఏవో శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు


