పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో కొట్లాట!
కాకతీయ, చెన్నారావుపేట : పల్లెల్లో సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగుతున్న వేళ, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒక్కసారిగా రణరంగంగా మారింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని చివరకు కుర్చిలతో దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పంచాయతీ కార్యాలయ ఆవరణలో సంబరాలతో అధికారుల సమక్షంలో జరగాల్సిన కార్యక్రమం రాజకీయ ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కుర్చిలు విసురుకోవడంతో అక్కడున్నవారు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తదుపరి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పంచాయతీ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


