ఏజెఎం కార్మికులకు అండగా కొరివి పరమేష్
318 మంది కార్మికుల సమస్యకు నాయకత్వం
మీనాక్షి నటరాజన్‌కు మెమోరాండం
మంత్రి పొంగులేటికి వినతి
కార్మికుల నుంచి కృతజ్ఞతలు
కాకతీయ, వరంగల్ సిటీ : అజం జాహి మిల్లులను కాపాడాలనే లక్ష్యంతో, మిల్లులో పనిచేస్తున్న 318 మంది కార్మికుల సమస్యను తన సమస్యగా భావించి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్ కీలక పాత్ర పోషించారని మిల్లు కార్మికులు పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి అండగా నిలిచినందుకు ఆయనకు శనివారం కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను వరంగల్ ప్రాంతానికి చెందిన అజం జాహి మిల్లు కార్మికులు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్ ఆధ్వర్యంలో కలిసి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా 318 మంది కార్మికులకు సంబంధించిన స్థలం, భవనం సమస్యలను వివరించారు.
సానుకూల స్పందన…!
కార్మికుల విజ్ఞప్తికి మీనాక్షి నటరాజన్ సానుకూలంగా స్పందించి, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు కార్మికులు తెలిపారు. అదేవిధంగా వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వాలని ఆమె సూచించినట్లు వెల్లడించారు.
నటరాజన్ సూచన మేరకు కార్మికులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి మెమోరాండం అందించారు. కార్మికులకు కేటాయించిన స్థలంలో భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరగా, ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గంతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారని కార్మికులు తెలిపారు. 318 మంది కార్మికుల సమస్యను అజం జాహి మిల్లు కార్మికుల అజెండాగా తీసుకుని, మీనాక్షి నటరాజన్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ కల్పించిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్‌కు కార్మికులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్, కొమ్ముల సందీప్ కుమార్, సింగిరెడ్డి యశోద, గుత్తికొండ రవి, గద్దల శ్యామ్, సిరిమల్లె మార్కండేయ, ఆరెళ్లి బిక్షపతి, కొమ్ముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


