“పది” ప్రతిభావంతులకు విమాన ప్రయాణం
కాకతీయ, నర్సింహులపేట : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 565 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులను విమానంలో ఒక ప్రదేశానికి తన స్వంత ఖర్చులతో తీసుకెళ్తానని అజ్మీరాతండా గ్రామ పంచాయతీ కార్యదర్శి గంట సాత్విక్ ప్రకటించారు. తన పుట్టినరోజు సందర్భంగా శనివారం పెద్దనాగారం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్ స్నాక్స్ కోసం రూ.12 వేల ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడంలో ఇది ఆదర్శప్రాయమైన చర్య అని ప్రధానోపాధ్యాయురాలు జానకి సుమన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సికిందర్, రాజు, లచ్చు నాయక్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.


