పార్టీ విధానాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కాంగ్రెస్ నుంచి ముగ్గురు నాయకుల సస్పెన్షన్
జిల్లా, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిర్ణయం
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్
కాకతీయ, నర్సింహులపేట : పార్టీ విధి విధానాలను ఉల్లంఘించిన వారిపై ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్ స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ మేరకు ప్రకటించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా ఇతర పార్టీలకు సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో కార్యకర్తల అభీష్టం మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, జిల్లా పార్టీ ఆదేశాల ప్రకారం నర్సింహులపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడుదుల రామకృష్ణతో పాటు మరో ఇద్దరు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కడుదుల రామకృష్ణను మూడు నెలల పాటు గ్రామశాఖ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నామని తెలిపారు. పార్టీ ఐక్యతకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బ సోమిరెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు దస్రు నాయక్, యువజన నాయకుడు చిర్ర సతీష్, నాయకులు అల్వాల శ్రీనివాస్, వివిధ గ్రామాల నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
రాజకీయ వర్గాల్లో చర్చ
అయితే సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన ముగ్గురు వ్యక్తులు మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి నూతన సర్పంచుల అభినందన సభలో ఎమ్మెల్యే రామచంద్రనాయక్ సమక్షంలో స్టేజీపై కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.


