ఉపాధి పథకం పేరు మార్చొద్దు
ఎన్డీఏపై గాంధీపథం రాష్ట్ర కన్వీనర్ శంకర్‌రెడ్డి తీవ్ర విమర్శలు
కాకతీయ, కొత్తగూడెం : జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పిడి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని గాంధీపథం రాష్ట్ర కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమని, ఇది దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. నెహ్రు, గాంధీ పేర్లను పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. ప్రజల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. పేరు మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ గాంధీపథం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50 వేలకుపైగా గాంధీపథం క్యాడర్ ఉందని, మొదట ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు ప్రారంభించి, అనంతరం అన్ని జిల్లాల్లో విస్తరింపజేస్తామని తెలిపారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తామని, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలకు కనువిప్పు కలిగిస్తామని చెప్పారు. సమావేశంలో గాంధీపథం జిల్లా కన్వీనర్ చింతలచెర్వు గిరిశం, సభ్యులు జ్ఞానవినోదిని, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.


