సమన్వయంతోనే పంచాయతీ ఎన్నికలు సజావు
తహసిల్దార్ ఎండి. రియాజుద్దీన్
కాకతీయ, గీసుగొండ : అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా పూర్తిచేశామని గీసుగొండ తహసిల్దార్ ఎండి. రియాజుద్దీన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన అధికారులకు అభినందనలు తెలియజేస్తూ మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్ తదితర శాఖల మధ్య పూర్తి స్థాయి సమన్వయం ఉండటంతో ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదని చెప్పారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన అధికారుల కృషితోనే ఎన్నికలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. కలిసికట్టుగా పనిచేస్తే ఏ పనినైనా సులభంగా సాధించవచ్చని అన్నారు. ఎంపీడీఓ వి. కృష్ణవేణి మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగియడం మండలానికి గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం ఎన్నికల నిర్వహణలో విశేషంగా కృషి చేసిన అధికారులను శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో ఎంపీఓ పాక శ్రీనివాసులు, సూపరిండెంట్ కమలాకర్, పీఆర్ ఏఈ అనిల్ కుమార్, ఏఓ హరి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు, ఈజీఎస్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


