కడియంకు పొలిటికల్ ర్యాగింగ్
ఆడో.. మగో తేల్చుకోవాలంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
రాజకీయ వ్యభిచారి అంటూ రాజయ్య ఫైర్
దమ్ముంటే ఎన్నికల ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీ
గులాబీ శ్రేణుల వినూత్న నిరసన
ఫ్లెక్సీ తొలగింపునకు పోలీసుల ప్రయత్నం
బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత
ఘన్‌పూర్ గడ్డపై మళ్లీ వేడేక్కిన రాజకీయం
కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే
బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ఇటీవల స్పీకర్‌కు అఫిడవిట్
తాను ఏ పార్టో చెప్పుకోలేని సంకటి స్థితిలో కడియం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాను ఏ పార్టీలో ఉన్నానో ధైర్యంగా చెప్పుకోలేని సంకటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీన్ని అదునుగా భావిస్తున్న బీఆర్ఎస్ ఆయనపై వరుసగా విమర్శల దాడికి దిగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మొదలుకొని … మాజీ ఎమ్మెల్యే రాజయ్య వరకు పదునైన విమర్శలు చేస్తున్నారు. మరింత ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తూ పొలిటికల్ ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన కడియం శ్రీహరి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌కు అఫిడవిట్ ద్వారా తాను బీఆర్ఎస్‌లో ఉన్నానని తెలియజేశారు. దీంతో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. తిరుమలనాథ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియంకు స్వాగతం అంటూ ఆపార్టీ శ్రేణులు శనివారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తీవ్ర వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగగా, దీనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గట్టిగా అడ్డుకున్నారు. ఫ్లెక్సీ తొలగింపును నిరసిస్తూ గులాబీ శ్రేణులు నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు జోక్యం చేసు కొని పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడంతో గొడవ సద్దుమనిగింది.
బీఆర్‌ఎస్ గుర్తింపు వాడటం సరికాదు : బీఆర్ఎస్ నాయకులు
పార్టీ మారిన తరువాత కూడా బీఆర్‌ఎస్ గుర్తింపు వాడటం సరికాదని, ఇది రాజకీయ నైతికతకు విరుద్ధమని అరెస్ట్ అయిన అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని, పార్టీ మారిన కడియం స్పష్టమైన రాజకీయ వైఖరితో ప్రజల ముందుకు రావాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచిన కడియం శ్రీహరి అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే తాజాగా తాను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని స్పీకర్‌కు అఫిడవిట్ ఇవ్వడం రాజకీయంగా తప్పుదోవ పట్టించే చర్యగా వారు అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. దమ్ముంటే బహిరంగంగా బీఆర్‌ఎస్ కండువా కప్పు కుని నియోజకవర్గంలో తిరగాలని సవాల్ విసిరారు. మున్సిపల్ కమిషనర్ పార్టీ ఏజెంట్‌లా వ్యవహరిస్తూ ఫ్లెక్సీ తొలగించారని ఆరోపించారు. అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండి, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. వెంటనే కడియం బద్ధి తెచ్చుకోవాలి.. ఇకపై ఇలాంటి చర్యలు కొనసాగితే తెలంగాణ ఉద్యమాన్ని తలపించే రీతిలో గ్రామ గ్రామాన కడియంను తరిమికొడతామని బీఆర్‌ఎస్ శ్రేణులు హెచ్చరించారు.
కడియం శ్రీహరి ఆడా.. మగా: కేటీఆర్
పంచాయతీ ఎన్నికల్లో 66శాతం గెలిచామని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మరోసారి సవాల్ విసిరారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు గబ్బిలాల్లా వేలాడుతున్నారు. పదవుల కోసం ఇంత దిగజారుతారా? అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగమైపోయాయి. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి ఆడోళ్లా.. మొగోళ్లా.. స్పీకర్ ముందే పచ్చి అబద్ధాలా?’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అక్రమంగా చేర్చుకున్న పది మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి, ఎన్నికల ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఎవరి వైపు ఉన్నదో ప్రజలు నిర్ణయిస్తారని,దమ్మూ ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య సైతం కడియం శ్రీహరిపై తవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. కడియం శ్రీహరికికి ఏమాత్రం శిగ్గు, శరం ఉన్నా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీచేసి గెలవాలని సవాల్ విసురుతున్నారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శిస్తున్నారు.


