వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయ సేవలు
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వయోవృద్ధుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక-చట్టపరమైన బాధ్యత అని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ స్పష్టం చేశారు. శనివారం వరంగల్ ఆర్డీఓ కార్యాలయంలో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సేవల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారదతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ… ఈ న్యాయ సేవల శిబిరం కేవలం ఒక కార్యక్రమం కాదని, ఇంట్లో ఉన్న వృద్ధులకు ఇచ్చే భరోసా అని పేర్కొన్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది వృద్ధులు ఒంటరితనం, నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధుల హక్కుల పరిరక్షణ కోసమే కేంద్ర ప్రభుత్వం 2007లో తల్లిదండ్రులు మరియు వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టంను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఈ చట్టం ద్వారా వృద్ధులకు పోషణ హక్కు, ఆస్తి రక్షణ, తక్షణ పరిష్కారం వంటి హక్కులు కల్పించబడ్డాయని వివరించారు. సమస్యలు ఎదురైతే భయపడకుండా న్యాయ సేవా శిబిరాలను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు పొందాలని సూచించారు. జిల్లా కలెక్టర్ డా. సత్య శారద మాట్లాడుతూ… వృద్ధులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, అవసరమైన న్యాయ సహాయం సకాలంలో అందించడమే ఈ శిబిరం ప్రధాన లక్ష్యమని తెలిపారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. సాయికుమార్, ఆర్డీఓ టి. సుమ, డీఏఓ ఫణికుమార్, న్యాయవాది యస్. కుమార్, పారా లీగల్ వాలంటీర్ ఆలేటి డార్కస్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు మల్లారెడ్డి, పలువురు వయోవృద్ధులు పాల్గొన్నారు.


