ప్రమాదాల తగ్గింపే ప్రభుత్వ లక్ష్యం
ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ ఫోర్స్ ఏర్పాటు
మంత్రి పొన్నం ప్రభాకర్
రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జనవరిలో నిర్వహించే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసందర్భంగా సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గత ఏడాది తెలంగాణలో 25,934 రోడ్డు ప్రమాదాల్లో 7,949 మంది మృతి చెందారని, ప్రధానంగా రాష్ డ్రైవింగ్, నిబంధనల ఉల్లంఘనే కారణమని మంత్రి తెలిపారు. ప్రమాదాల నివారణకు రోడ్డు నిబంధనలపై కఠిన చర్యలతో పాటు విస్తృత అవగాహన అవసరమన్నారు. ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ కమిటీలు నెలాఖరులోపు సమావేశం నిర్వహించాలని, జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అలాగే రోడ్ సేఫ్టీ ఫోర్స్ వాలంటీర్ బృందాలు ఏర్పాటు చేసి గ్రామాలు, పాఠశాలల్లో అవగాహన కల్పించాలన్నారు. ల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరి చేయడం, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ ఫోన్‌తో డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో క్యాష్‌లెస్ చికిత్స అమలు చేస్తున్నామని, సహాయం చేసిన వారికి రహవీర్ గుడ్ సమారిటన్ పథకం కింద నగదు పురస్కారం అందించనున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్‌లను గుర్తించి తొలగించాలని, రోడ్డు కూడళ్ల వద్ద సంకేతాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థుల భాగస్వామ్యంతో విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.


