నీటి కోసం కాలి బిందెలతో నిరసన!
“పది రోజులుగా తాగునీరు లేదు”
“మిషన్ భగీరథ పైపులే పనికిరావడం లేదు”
“అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆగ్రహం”
నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా
కాకతీయ, నర్సంపేట టౌన్ : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 1వ వార్డు ఎన్జీవోస్ కాలనీలో తాగునీటి సమస్య తారస్థాయికి చేరింది. గత పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో విసిగిపోయిన మహిళలు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. మున్సిపల్ సిబ్బంది పాత పైపులైన్లు తొలగించి కొత్త మిషన్ భగీరథ పైపులు అమర్చినప్పటికీ, ఇళ్ల నల్లాలకు నీరు చేరడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పైపుల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉండటంతో తాగునీరు రోడ్లపై వృథాగా ప్రవహిస్తున్నదని ఆరోపించారు. ఎన్నిసార్లు అసిస్టెంట్‌కు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని మహిళలు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కాలి బిందెలతో ధర్నా చేపట్టామని తెలిపారు. తక్షణమే సమస్యను పరిష్కరించి కాలనీకి తాగునీటి సరఫరా అందించాలని మున్సిపల్ అధికారులను వారు డిమాండ్ చేశారు.


