ఇళ్లు పేదలకివ్వకపోవడం అన్యాయం
రెండేళ్లుగా ఇళ్ల పంపిణీపై నిర్లక్ష్యం
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రాజకీయాలు సరికాదు
అర్హులకు తక్షణమే కీలు ఇవ్వాలి
గత ప్రభుత్వ నిర్మాణాలను వెంటనే కేటాయించాలి
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
కాకతీయ, వరంగల్ సిటీ : గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయిన రెండు పడకల ఇండ్లను అర్హులైన పేదలకు ఇవ్వకపోవడం అన్యాయమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ విమర్శించారు. దూపకుంట, తిమ్మాపూర్, లక్ష్మీ టౌన్షిప్‌లలో పూర్తైన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను వెంటనే పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో శనివారం వరంగల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు మెమోరాండం అందజేశారు. పూర్తయిన ఇళ్లను రెండేళ్లుగా పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటని నాయకులు ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేయకపోవడం సమంజసం కాదన్నారు.
పేదలకు నిలువ నీడ కల్పించాలి
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో వసతులు కల్పించి వెంటనే నివాసయోగ్యంగా మార్చాలని, ఖాళీగా ఉండటంతో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు హామీ ఇచ్చిన రెండు పడకల ఇండ్లను కూడా తక్షణమే కేటాయించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా యంత్రాంగం స్పందించి పేదలకు నిలువ నీడ కల్పించాలని ఎంసిపిఐ(యు) నేతలు విజ్ఞప్తి చేశారు.


