తూర్పు కాంగ్రెస్‌లో ఆరని మంటలు
కొండా సురేఖ, బస్వరాజు సారయ్య మధ్య పతాక స్థాయికి ఆధిపత్య పోరు
సారయ్య వర్గంలోకి నల్లగొండ రమేష్ చేరికతో రాజుకున్న అగ్గి
రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల కేంద్రంగానే మార్పులు
సంచలనం సృష్టిస్తున్న తాజా రాజకీయ పరిణామాలు
మీనాక్షి నటరాజన్‌తో నల్గొండ రమేష్ భేటీ ..!
కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు ?
రాజధానికి చేరిన వరంగల్ తూర్పు రాజకీయం
హైదరాబాద్‌లో పలువురు నేతల కీలక భేటీ
రాజకీయ సమీకరణాలపై సుదీర్ఘ చర్చ
‘మీకు నేను ఉన్నాను’ అని మీనాక్షి భరోసా
భాగ్యనగరంలో హాట్ టాపిక్‌గా వరంగల్ తూర్పు రాజకీయం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ కలకలం రేపుతోంది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య ఆధిపత్య పోరు మరోమారు తారాస్థాయికి చేరింది. దీంతో కొండా వర్సెస్ సారయ్యగా పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు… ఎత్తులు, పైఎత్తులతో తూర్పు కాంగ్రెస్‌లో రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. మంత్రి కొండా సురేఖకు అనేక ఏండ్లుగా ప్రధాన అనుచరుడిగా ఉన్న నల్లగొండ రమేష్ బస్వరాజు సారయ్య వర్గంలో చేరిపోవడం .. మరో అనుచరుడు గోపాల నవీన్‌రాజ్‌పై కేసు నమోదవడంతో సారయ్యపై కొండా వర్గం రగలిపోతోంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో నల్లగొండ రమేష్ భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సీనియర్ నేతలు ఎర్రబెల్లి స్వర్ణ, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు కొండా సురేఖకు వ్యతిరేకంగా పార్టీలో పనిచేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. తాజాగా మీనాక్షితో రమేష్ సమావేశమవడం తీవ్ర చర్చనీయాంశమైంది.



