భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు
2016లో వివాహం.. 2023లో దారుణ హత్య
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.4,000 జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం… వెల్గటూర్ మండలానికి చెందిన బొల్లం జగదీష్ 2016లో బొల్లం రాజేశ్వరిని వివాహం చేసుకున్నాడు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో 2023 మార్చి 30వ తేదీ తెల్లవారుజామున సుమారు 3.15 గంటలకు తన భార్యపై ఆయుధంతో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో వెల్గటూర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు, నిందితుడిపై హత్య నేరం రుజువైనట్లు నిర్ధారించింది. దీంతో కోర్టు జగదీష్‌కు జీవిత ఖైదు శిక్ష విధించడంతో పాటు రూ.4,000 జరిమానా విధించింది. ఈ కేసు దర్యాప్తులో ఇన్స్పెక్టర్లు కోటేశ్వర్, రమణమూర్తి, సీఏంఎస్ ఎస్‌ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ ఎం. కిరణ్ కుమార్, కోర్టు కానిస్టేబుల్ శ్రీధర్ కీలక పాత్ర పోషించగా, వారి సేవలను జగిత్యాల జిల్లా ఎస్పీ అభినందించారు.


