అనుమానితులందరికీ టీబీ పరీక్షలు
మొబైల్ ఎక్స్‌రే యంత్రంతో గ్రామాల్లోనే నిర్వహణ
రోజుకు 60 మందికి పరీక్షల సామర్థ్యం
టీబీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అల్ట్రా పోర్టబుల్ హ్యాండిల్ హెల్డ్ మొబైల్ ఎక్స్‌రే యంత్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మొబైల్ ఎక్స్‌రే యంత్రం ద్వారా రోజుకు సుమారు 60 మంది వరకు పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు. గ్రామాల్లో రోగుల వద్దకే వెళ్లి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించడం ద్వారా టీబీ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సదుపాయాన్ని జిల్లా ప్రజలందరూ పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు.
అనుమానితులందరికీ పరీక్షలు..
గ్రామాల్లో టీబీ అనుమానితులందరికీ ఈ మొబైల్ ఎక్స్‌రే ద్వారా పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయిన వారిని నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేసి, అవసరమైన మందులు పంపిణీ చేస్తామని వివరించారు.
ఈ విధానంతో ఎక్కువ మంది టీబీ బాధితులను త్వరితగతిన గుర్తించి వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని డాక్టర్ గోపాల్ రావు పేర్కొన్నారు. గ్రామస్థాయి ఆరోగ్య సిబ్బంది టీబీ వ్యాధిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. టీబీ నియంత్రణ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో పనిచేసి నోటిఫికేషన్‌లు, ప్రిజంప్టివ్ ట్రీట్మెంట్ సంఖ్యను పెంచాలని ఆదేశించారు. డిసెంబర్ నెలలోపు సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేసి, షెడ్యూల్ ప్రకారం విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ చంద్రకాంత్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ బ్లేస్సి, డెమో సంపత్, టీబీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమేష్, ల్యాబ్ టెక్నీషియన్లు చంద్రమౌళి, ఎస్.టి.ఎస్ రాజు, పరుశురాం, ఎన్‌జీఓ ప్రతినిధి రాజు తదితరులు పాల్గొన్నారు.


