విద్యార్థులు బాల శాస్త్రవేత్తలుగా ఎదగాలి
గిరిజన ప్రాంతం నుంచే వినూత్న ఆవిష్కరణలు రావాలి
జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలి
జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి
జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శిని ప్రారంభం
ఇన్స్పైర్–మానక్‌లో ములుగు విద్యార్థుల సత్తా
కాకతీయ, ములుగు ప్రతినిధి : విద్యార్థులు చిన్న వయస్సు నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని బాల శాస్త్రవేత్తలుగా ఎదగాలని, ములుగు జిల్లా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి జిల్లాకు గౌరవం తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) సంపత్ రావు ఆకాంక్ష వ్యక్తం చేశారు.పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి మార్గదర్శకత్వంలో పి.ఎం. తెలంగాణ మోడల్ స్కూల్, బండారుపల్లి ప్రాంగణంలో నిర్వహించిన 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శిని మరియు ఇన్స్పైర్–మానక్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంపత్ రావు మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం, గ్రామీణ నేపథ్యం, గిరిజన ప్రాంతం వంటి పరిమితులు అడ్డుకాకూడదన్నారు. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లా నుంచి ఆధునిక శాస్త్రీయ ఆలోచనలు, సృజనాత్మకతతో కూడిన వినూత్న ప్రాజెక్టులు వెలువడాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్–మానక్ కార్యక్రమాల్లో ములుగు జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థుల సమన్వయంతో భవిష్యత్తులోనూ అన్ని శాస్త్రీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, డిసిఈబి కార్యదర్శి సూర్యనారాయణ, ఏసీజీఈ వినోద్ కుమార్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు అర్షం రాజు, శ్యామ్ సుందర్ రెడ్డి, బుర్ర రజిత, సైకం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు.


