గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మేడారం మార్గం మరింత అభివృద్ధి చేస్తాం
: మంత్రి సీతక్క
ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కోటి రూపాయలతో గిరిజన బాలికల జూనియర్ కాలేజీ భవనం ప్రారంభం
ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే విగ్రహాల ఆవిష్కరణ
జంపన్నవాగుపై కరకట్టకు రూ.1.95 కోట్లతో శంకుస్థాపన
కాకతీయ, ములుగు ప్రతినిధి : గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. తాడ్వాయి మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల జూనియర్ కళాశాల నూతన భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన బాలికలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ భవనం ద్వారా విద్యార్థినులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం తాడ్వాయి మండల కేంద్రంలోని మేడారం జంక్షన్‌లో అభివృద్ధి సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఆదివాసీ మహిళల నృత్యాల విగ్రహాలు, బాణాల విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.38 లక్షల వ్యయంతో ఈ విగ్రహాలను నిర్మించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఇవి నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు.
ఏటూరునాగారం మండలం బుటారం గ్రామంలో జంపన్నవాగుపై కరకట్ట నిర్మాణానికి రాష్ట్ర నీటిపారుదల ఆయకట్టు శాఖ ద్వారా రూ.1.95 కోట్లతో మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ప్రతి ఏడాది వరదలతో ముంపుకు గురయ్యే బుటారం గ్రామాన్ని కరకట్ట నిర్మాణంతో రక్షిస్తామని, పనులు వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల, సీనియర్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


