రాజకీయ భవిష్యత్తుకు సర్పంచ్ పదవే కీలకం!
ప్రజల నమ్మకమే రాజకీయ బలం
హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం
బీఆర్ఎస్కు రానున్న రోజులు అనుకూలం
మాజీ మంత్రి రెడ్యా నాయక్
కాకతీయ, మరిపెడ : రాజకీయ భవిష్యత్తుకు సర్పంచ్ పదవే కీలకమని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ అన్నారు. శుక్రవారం చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలోని తన నివాస గృహంలో బాల్య తండా నూతన సర్పంచ్ జర్పుల కాలు నాయక్ తన అనుచరులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెడ్యా నాయక్ నూతన సర్పంచ్‌కు శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మీపై నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నప్పుడే వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు రాజకీయంగా ఎదగడానికి ఇదే కీలక దశ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఆ కారణంగానే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్‌లుగా ఎన్నుకున్నారని అన్నారు. ప్రజల తీర్పే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు తప్పక వస్తాయని జోష్యం చెప్పారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఎలాంటి ఆత్మవిశ్వాస లోపానికి గురికావద్దని సూచించారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగితే రాజకీయ భవిష్యత్తు సుస్థిరమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో బాల్య తండా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


