చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండాలి
జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి టెన్నిస్ పోటీల్లో రాణించాలి
గ్రామీణ పాఠశాలల్లో టెన్నిస్ అభివృద్ధికి సహకారం
హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల సురేందర్ రెడ్డి
క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ
కాకతీయ, హనుమకొండ : టెన్నిస్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి టెన్నిస్ పోటీల్లో రాణించి హనుమకొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. టెన్నిస్ క్రీడ వల్ల శారీరక దారుఢ్యం, చురుకుదనం పెరగడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో టెన్నిస్ క్రీడ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రగట్టు స్వామి మాట్లాడుతూ, హైదరాబాద్లో నిర్వహించనున్న అండర్–14, అండర్–19 పాఠశాలల రాష్ట్రస్థాయి టెన్నిస్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబర్చి వరంగల్ జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లాలో టెన్నిస్ క్రీడ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో టెన్నిస్ క్రీడను ప్రవేశపెడితే అసోసియేషన్ తరఫున బ్యాట్లు, బాల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేశారు.
కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అండర్–19 ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీధర్, జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కుంజు బిహారి, మల్లారెడ్డి, కోశాధికారి సిరికొండ సుదర్శన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్, వినీల్, ఫిజికల్ డైరెక్టర్లు సుధాకర్, సుభాష్, మల్లయ్య, అలేఖ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


