21న హుజురాబాద్‌లో పీవీ విగ్రహ ఆవిష్కరణ
పీవీ కుమారుడు ప్రభాకరరావు చేతుల మీదుగా ఆవిష్కరణ
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణం సైదాపూర్ క్రాస్‌రోడ్డులో ఈ నెల 21న భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు పీవీ సేవాసమితి ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం పీవీ సేవాసమితి, అలయన్స్ క్లబ్ నాయకులు బల్దియా కమిషనర్ కేంసారపు సమ్మయ్య చేతుల మీదుగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పీవీ నరసింహారావు కుమారుడు పీవీ ప్రభాకరరావు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పీవీ సేవాసమితి అధ్యక్షుడు తూము వెంకటరెడ్డి తెలిపారు. అనంతరం హుజురాబాద్ క్లబ్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించిన దాతలను ప్రత్యేకంగా సన్మానించనున్నట్లు తెలిపారు. పీవీ నరసింహారావు చేసిన సేవలను గుర్తు చేసుకునేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పీవీ అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సేవాసమితి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బి.మనోజ్, చిలుకమారి శ్రీనివాస్, జి.జైపాల్‌రెడ్డి, చందుపట్ల జనార్ధన్, టి.మాధవరావు, సీడ్స్ సంపత్‌రావు, సందేల వెంకన్న, పి.స్వామి, మాజీ సర్పంచ్ పి.సుధాకర్, విశ్రాంత ఉపాధ్యాయులు కె.సదానందం, కె.సుభాష్, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.


