మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
డీజీపీ ఎదుట 41 మంది మావోయిస్టుల లొంగుబాటు
24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కీలక నేత ఎర్రగొల్ల రవి లొంగుబాటు
ఆయుధాలతో సహా 24 తుపాకుల అప్పగింత
లొంగిపోయిన వారిపై రూ.1.46 కోట్ల రివార్డు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కీలక నేత ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ (డివిజనల్ కమిటీ సభ్యుడు)తో పాటు మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్ ఉన్నారు. మిగతా వారు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలతో సహా మొత్తం 24 తుపాకులను పోలీసులకు అప్పగించారు. వీటిలో ఎల్‌ఎంజీ, ఏకే–47 రైఫిల్స్, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్‌సాస్ రైఫిల్స్, గ్రెనేడ్ లాంచర్, 303 రైఫిల్స్, సింగిల్ షాట్ రైఫిల్స్, ఎయిర్ గన్స్ ఉన్నాయి. ఇవన్నీ పోలీసుల నుంచి కొల్లగొట్టిన ఆయుధాలేనని డీజీపీ వెల్లడించారు.

ఏడాదిలో 509 మంది లొంగుబాటు
ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, అనారోగ్య సమస్యలు, ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతోనే మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని చెప్పారు. 2026 మార్చి 31 వరకు కొత్త ప్రాంతాలకు వెళ్లాలన్న ఆదేశాలే లొంగుబాటుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకే ఈ లొంగుబాట్లు జరిగాయని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన 41 మందిపై మొత్తం రూ.1.46 కోట్ల రివార్డు ఉందని వెల్లడించారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందించినట్లు తెలిపారు. క్యాడర్ ప్రకారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వారికి రావాల్సిన పరిహారాన్ని అందిస్తామని చెప్పారు.

ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో మొత్తం 54 మంది మాత్రమే తెలంగాణకు చెందిన వారు ఉన్నారని, వీరిలో ఆరుగురు మాత్రమే రాష్ట్రంలో పనిచేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఆస్ట్రేలియాలో జరిగిన బోండీ బీచ్ కాల్పుల ఘటనపై స్పందించిన డీజీపీ, ఆ ఘటనకు హైదరాబాద్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ గతంలో ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లాడని, అతడు భారత్‌కు పలుమార్లు వచ్చినప్పటికీ ఈ ఉగ్రదాడికి తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.



