కోరపల్లి సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు?
పోలింగ్, కౌంటింగ్‌లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు
ప్రిసైడింగ్ అధికారి పక్షపాతంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు
వీడియో ఆధారాలు ఉన్నా పరిశీలనకు నిరాకరణ
కలెక్టర్‌ను ఆశ్రయించిన స్వతంత్ర అభ్యర్థి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని స్వతంత్ర అభ్యర్థి పల్లె రవికుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోరపల్లి గ్రామం నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని, తన ఎన్నికల గుర్తు ఫుట్‌బాల్ అని రవికుమార్ గౌడ్ తెలిపారు. అయితే ఎన్నికల నిర్వహణలో నిబంధనలను బేఖాతరు చేస్తూ అధికారులు వ్యవహరించారని ఆరోపించారు. కోరపల్లి గ్రామానికి ప్రిసైడింగ్ అధికారిగా నియమితుడైన అలుగువెల్లి జగన్ సారోత్తం రెడ్డి ఎన్నికల నిబంధనలను పాటించలేదని, ఎంఈఓ సహకారంతో కొందరు అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గెలిచిన అభ్యర్థి ఇంటి పక్కనే తన నివాసం ఉండటంతో వ్యక్తిగత పరిచయాల ఆధారంగా పక్షపాతం చూపినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. గ్రామంలోని పోలింగ్ బూత్ నంబర్–2, 5వ వార్డు పరిధిలో తప్పుడు ఓటింగ్ జరిగిందని, కౌంటింగ్ సమయంలో కూడా ఒక నిర్దిష్ట గుర్తు ఉన్న అభ్యర్థికి అనుకూలంగా సహకరించినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఉన్నప్పటికీ వాటిని పరిశీలించేందుకు అధికారులు నిరాకరించారని, తనకు వచ్చిన ఓట్ల వివరాలను చూపించడానికి కూడా అంగీకరించలేదని తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంపై సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను రవికుమార్ గౌడ్ కోరారు.


