తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. దొంగకు చెక్!
కేయూసీ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
సినిమాకు వెళ్లిన దంపతుల ఇంట్లో దొంగతనం
ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాల స్వాధీనం
టెక్నాలజీతో నిందితుడి పట్టివేత..
కాకతీయ, వరంగల్ బ్యూరో : తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కేయూసీ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆసిఫాబాద్ జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన సబ్బాని రంజిత్ (24) ప్రస్తుతం హనుమకొండ పరిధిలో నివాసం ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సంపాదనను మద్యం, జల్సాలకు ఖర్చు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఇతనిపై గతంలో 2020లో మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసు నమోదై జైలుకు వెళ్లి విడుదలైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కుటుంబంతో కలిసి గత మూడేళ్లుగా కెయూసి పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నాడు. ఈ నెల 12న సమీపంలో నివసిస్తున్న ఓ దంపతులు ఇంటికి తాళం వేసి సినిమా వెళ్లినట్లు గమనించిన నిందితుడు, ఎవరికి అనుమానం రాకుండా తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న నాలుగు బంగారు గాజులు (40 గ్రాములు), రూ.40 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను చోరీ చేసి పరారయ్యాడు. బాధితులు 250 గ్రాముల బంగారం చోరీ అయిందని ఫిర్యాదు చేయడంతో క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడి కదలికలపై నిఘా పెట్టి, శనివారం ఉదయం కెయూసి జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో చోరీ చేసిన బంగారు గాజులు లభ్యమయ్యాయి.
40 గ్రాముల బంగారం స్వాధీనం..!
విచారణలో తాను కేవలం 40 గ్రాముల బంగారం, రూ.40 వేల నగదు, సెల్‌ఫోన్ మాత్రమే చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించగా, బాధితుల ఇంటిని మళ్లీ తనిఖీ చేయగా మిగిలిన బంగారు ఆభరణాలు ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డీసీపీ దారా కవిత మాట్లాడుతూ, చోరీకి గురైన సొమ్మును అధికంగా చూపుతూ తప్పుడు ఫిర్యాదులు ఇస్తే సంబంధిత బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడి అరెస్టులో ప్రతిభ చూపిన సీసీఎస్, కెయూసి ఇన్‌స్పెక్టర్లు రాఘవేందర్, రవికుమార్, ఫింగర్ ప్రింట్ విభాగం ఇన్‌స్పెక్టర్ దేవేందర్, కెయూసి ఎస్‌ఐలు శ్రీకాంత్, కిరణ్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు మహేశ్వర్, జంపయ్య, కానిస్టేబుళ్లు మధుకర్, చంద్రశేఖర్, వంశీ, విశ్వేశ్వర్, ఐటీ కోర్ కానిస్టేబుళ్లు నాగేష్, ప్రవీణ్‌లను డీసీపీ అభినందించారు.


