ప్రజలు కోరిన మార్పు చూపించాం
సంక్షోభ తెలంగాణను పట్టాలెక్కించాం
ప్రభుత్వానికి పీఆర్‌వోలే గొంతు
డిజిటల్‌లో వెనుకబడితే నష్టమే
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్ల పాలనలోనే తెలంగాణ పాలనకు కొత్త దిశను నిర్దేశించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ప్రజలు కోరిన మార్పును ప్రజల కళ్ల ముందే నిలబెట్టామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామన్నారు. నాంపల్లిలోని మీడియా అకాడమీలో తెలంగాణ సమాచార–పౌర సంబంధాల శాఖ, మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ప్రజా సంబంధాల అధికారుల కోసం నిర్వహించిన పునశ్చరణ తరగతుల్లో శుక్రవారం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారం చేపట్టిన సమయంలో తెలంగాణ అన్ని రంగాల్లో తీవ్ర సంక్షోభంలో ఉందని మంత్రి గుర్తు చేశారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చామని, ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని స్పష్టం చేశారు.
ఉపాధి కల్పనకు కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఇవి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెడుతున్నాయని అన్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య వారధిగా ఉండాల్సిన ప్రజా సంబంధాల అధికారుల పాత్ర బలపడాల్సిన అవసరం ఉందన్నారు.కాలానికి తగ్గట్టు పీఆర్‌వోలు పని తీరును మార్చుకోవాలని స్పష్టం చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు డిజిటల్, సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించకపోతే ప్రభుత్వానికి నష్టమేనని హెచ్చరించారు.
క్షేత్రస్థాయిలో పథకాల అమలును పరిశీలించి, వాస్తవ కథనాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి జిల్లాకు సమర్థవంతమైన డీపీఆర్‌వోలను నియమించాలని, డిప్యూటేషన్‌లను రద్దు చేసి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని ఐ&పీఆర్ కమిషనర్‌కు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐడీసీ చైర్మన్ మువ్వ విజయబాబు, ఐ&పీఆర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీఎం సీపీఆర్వో జి. మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.


