పదేళ్లలో బ్రాండ్‌గా ఎదిగిన ఎస్‌ఐబీఎస్
యువత ఉపాధికి స్కిల్ డెవలప్‌మెంట్ కీలకం
మాజీ మేయర్ సునీల్ రావు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌లోని ఎస్‌ఐబీఎస్ అంతర్జాతీయ బ్యూటీ అకాడమీ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మేయర్, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్ రావు హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై మాత్రమే ఆధారపడకుండా స్వయం ఉపాధి దిశగా యువత ముందుకు సాగాలంటే ఇలాంటి శిక్షణ సంస్థలు మార్గనిర్దేశం చేస్తున్నాయని పేర్కొన్నారు.
బ్యూటీ రంగంలో శిక్షణ పొందితే తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి సాధించే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని, ఆ దిశగా ఎస్‌ఐబీఎస్ అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐబీఎస్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాత స్వప్న రావు పాల్గొని, అకాడమీ పదేళ్ల ప్రస్థానం, ఈ కాలంలో సాధించిన విజయాలను వివరించారు. అనేక మంది యువతులను స్వయం ఉపాధి వైపు నడిపించడమే లక్ష్యంగా అకాడమీ పనిచేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో అకాడమీ మిత్రబృందం, శిక్షణార్థులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


