ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
ప్రభాకర్‌రావు కస్టడీకి మరో వారం గడువు
కాకతీయ, న్యూఢిల్లీ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు కస్టడీని మరో వారం పాటు పొడిగిస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నెల 26న ప్రభాకర్‌రావును కస్టడీ నుంచి విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది. వారం రోజుల పాటు సాగిన కస్టోడియల్ విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) సుప్రీంకోర్టుకు సమర్పించింది. దర్యాప్తు పురోగతిని పరిశీలించిన అనంతరం, తదుపరి విచారణ వరకు ప్రభాకర్‌రావుపై ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్‌రావును సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది. కేసు విషయంలో సిట్‌కు అవసరమైన సమాచారం అందిస్తూ, విచారణకు అడ్డంకులు కలగనివ్వకూడదని సూచించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి. సిట్ దర్యాప్తు దిశ, తదుపరి విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయాలపై రాజకీయంగా, పరిపాలనా రంగాల్లో ఆసక్తి నెలకొంది


