ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు!
కొత్త సిట్ ఏర్పాటు.. సజ్జనార్‌కు బాధ్యతలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న విచారణకు తోడుగా మరో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక విచారణ జరగనున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా ఉంచడంతో పాటు, విచారణ వేగవంతం చేయాలన్న ఉద్దేశంతోనే మరో సిట్‌ను రంగంలోకి దింపినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్
హైదరాబాద్ కొత్వాల్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఈ కొత్త సిట్‌ను ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లోతైన దర్యాప్తు, కీలక అంశాలపై స్పష్టత తీసుకురావడమే ఈ బృందం ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఈ సిట్‌లో మొత్తం 9మంది అధికారులు ఉండనున్నారు. అందులో 5మంది ఐపీఎస్ అధికారులు ఉండగా, మిగతా వారు సాంకేతిక, దర్యాప్తు అనుభవం ఉన్న సీనియర్ అధికారులు. కేసు సున్నితత్వం, సాంకేతిక సంక్లిష్టత దృష్ట్యా అనుభవజ్ఞులనే ఎంపిక చేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు మొదటి నుంచే రాజకీయంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజా సిట్ ఏర్పాటు నిర్ణయంతో ఈ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రానున్న రోజుల్లో ఈ కొత్త సిట్ దర్యాప్తు ఏ స్థాయిలో ముందుకెళ్తుందో, ఎవరిపై వేటు పడుతుందోనన్న ఆసక్తి రాజకీయ, పరిపాలనా వర్గాల్లో నెలకొంది.


