పొలంలో ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
నెల్లికుదురు మండలం బంజర గ్రామంలో విషాద ఘటన
కాకతీయ, నెల్లికుదురు : నెల్లికుదురు మండలం బంజర గ్రామంలో పొలం దమ్ము చేస్తూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం నెల్లికుదురు గ్రామానికి చెందిన హెచ్చు యాకయ్య (42) కొన్నేళ్లుగా తన అత్తగారి ఊరు శ్రీరామగిరిలో నివాసం ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం బంజర గ్రామానికి చెందిన చిర్ర మోహన్ రెడ్డి ట్రాక్టర్‌ను దమ్ము పనుల కోసం నడపడానికి యాకయ్య యాక్టింగ్ డ్రైవర్‌గా వెళ్లాడు. ఈ క్రమంలో పొలంలో దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ట్రాక్టర్ కింద పడిన యాకయ్య తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. యాకయ్య మృతితో కుటుంబం దిక్కులేనిదిగా మారగా, భార్యా పిల్లల రోదనలు గ్రామాన్ని కలచివేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


