సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లకు ముందస్తు చర్యలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 2026 జనవరి చివరి వారంలో నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ వనదేవతల జాతరను ఘనంగా నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం రేకుర్తి, హౌసింగ్‌బోర్డు (బొమ్మకల్ శివారు) ప్రాంతాల్లోని సమ్మక్క–సారలమ్మ గద్దెలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గతంలో నగరపాలక సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు, జాతర సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ సూచనల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారులు తదితర సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.


