పవన్ – అల్లు.. లోకేశ్ ఎవరితో?
టాలెంటెడ్ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్‌ల దృష్టి
కాకతీయ, సినిమా : ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ డిమాండ్ ఉన్న స్టార్ దర్శకుల్లో కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఒకరిగా నిలుస్తున్నారు. తక్కువ సినిమాలతోనే తనదైన ముద్ర వేసుకున్న లోకేశ్‌కు టాలీవుడ్‌లోనూ క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఆయనతో తెలుగు స్టార్ హీరో సినిమా అన్న మాటే అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. ఇటీవల లోకేశ్‌తో సినిమా చేసే అవకాశం కోసం పలువురు తెలుగు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరిదో ఒకరిదో ప్రాజెక్ట్ దాదాపు లాక్ అయినట్టే అన్న ప్రచారం జరుగుతోంది. సమాచారం ప్రకారం, టాప్ నిర్మాణ సంస్థల వద్ద పవన్ కళ్యాణ్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌కు సంబంధించిన డేట్లు ఇప్పటికే బ్లాక్ అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అల్లు అర్జున్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌పై కూడా లోకేశ్ ఆలోచన చేస్తున్నారని టాక్. పవన్ కోసం ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ సిద్ధం చేశారని, అల్లు అర్జున్‌కు తగ్గ కమర్షియల్ యాక్షన్ కథపై కూడా చర్చలు సాగుతున్నాయని సమాచారం. ఇలా రెండు వైపులా అవకాశాలు ఉండటంతో లోకేశ్ కనగరాజ్ తదుపరి తెలుగు సినిమా ఎవరి తో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.


