ఓడిన వారికి అండగా పార్టీ
గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ బలంగా నిలిచింది
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్
కాకతీయ, రామకృష్ణాపూర్ : రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎన్నికల్లో ఓడిన వారికీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ స్పష్టం చేశారు. గురువారం రామకృష్ణాపూర్ మండలం క్యాతన్‌పల్లిలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ నూతన గ్రామ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కేటాయించిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా చెన్నూరు నియోజకవర్గంలో తట్టెడు మట్టిని కూడా తీయలేదని బాల్క సుమన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందే వరకు నియోజకవర్గం వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి తాను బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో అడ్డంకులు సృష్టించినా, అభ్యర్థులను ఇబ్బందులు పెట్టినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి ప్రయత్నించినా ప్రజలు బీఆర్ఎస్ వైపే విశ్వాసం చూపారని బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన నిధులను వెనక్కి పంపించి, అభివృద్ధి పనులను నిలిపివేసిన చరిత్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికే దక్కుతుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గుర్తుతో బరిలో నిలిచి తమ సత్తా చూపాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి బాల్క సుమన్ సవాల్ విసిరారు.


