యాప్ విధానంలో సకాలంలో ఎరువుల పంపిణీ
జిల్లా వ్యవసాయ అధికారి కె. అనురాధ
కాకతీయ, గీసుగొండ : సాగుదారులకు సకాలంలో ఎరువులు అందించడంతో పాటు విక్రయ కేంద్రాల వద్ద రద్దీ తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేపడుతోందని జిల్లా వ్యవసాయ అధికారి కె. అనురాధ తెలిపారు. గీసుగొండ మండలంలోని కొనాయి మాకుల రైతు వేదికలో నిర్వహించిన ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ యాప్ ద్వారా పట్టాదారు పాస్‌బుక్ కలిగిన రైతులు పాస్‌బుక్ నంబర్‌తో, పట్టా లేని రైతులు ఆధార్ నంబర్‌తో నమోదు చేసుకోవాలని సూచించారు. కౌలు రైతులు భూ యజమాని అనుమతితో ఓటీపీ ధృవీకరణ అనంతరం ఎరువులు బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సాగు విస్తీర్ణాన్ని బట్టి ఎరువులు విడతల వారీగా అందజేస్తామని, రైతుకు ఎంతమేర ఎరువులు అవసరమో యాప్ స్వయంగా లెక్కిస్తుందని వివరించారు. ఒక విడత తీసుకున్న అనంతరం మరో స్లాట్‌కు 15 రోజుల వ్యవధి ఉంటుందని చెప్పారు. బుక్ చేసిన 24 గంటలలోపు సంబంధిత డీలర్ వద్ద ఎరువులు తీసుకోవాలని, లేనిపక్షంలో బుకింగ్ స్వయంచాలకంగా రద్దవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. హరి ప్రసాద్ బాబు, ఏఈఓలు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.


