ఆలయ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలి
నాణ్యతతో పాటు గడువు కీలకమే
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ ఆలయ పనులపై సమీక్ష
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడలోని దేవస్థానం అతిథి గృహంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయ రాజగోపుర నిర్మాణం, ఆలయ విస్తరణ పనులు, శ్రీ బద్దీ పోచమ్మ ఆలయ నిర్మాణం, రాజగోపుర అభివృద్ధి పనులపై అధికారులు వివరాలు సమర్పించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, పర్యవేక్షణ కట్టుదిట్టంగా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న నిత్య అన్నదానం భవనం, ఇతర అనుబంధ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాల వద్ద భక్తులకు సరిపడా పార్కింగ్ సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. నిర్మాణ భద్రత, రూపకల్పన, సాంకేతిక అంశాల్లో నిపుణుల సూచనలు తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి పనులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సంప్రదాయ శైలిని పరిరక్షిస్తూ పూర్తి చేయాలని అధికారులను ఆది శ్రీనివాస్ ఆదేశించారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన విభాగీయ, కార్యనిర్వాహక ఇంజినీర్లు, నిర్మాణ నిపుణులు, ప్రత్యేక అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. దేవస్థానం కార్యనిర్వాహక అధికారి, ఇంజినీరింగ్ అధికారులు, సహాయక కార్యనిర్వాహక అధికారులు, ఆలయ సిబ్బంది హాజరయ్యారు.


