ఆర్వో ఆఫీసే వసూళ్ల అడ్డాగా
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారుల ఇష్టారాజ్యం
డాక్యుమెంట్ కో రేటు.. మాములుగా దండుకుంటున్న అధికార గణం
మధ్యవర్తులకు దారి.. సామాన్యులకు చుక్కలు
పైసలిస్తేనే పని… లేకపోతే సిస్టమ్ డౌన్
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
పర్యవేక్షణ కార్యాలయానికి పర్యవేక్షణ కరువు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనితీరును పర్యవేక్షించాల్సిన జిల్లా అష్యూరెన్స్‌ల రిజిస్ట్రార్ కార్యాలయమే ఇప్పుడు అక్రమ వసూళ్లకు కేంద్రబిందువుగా మారిందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. చట్టబద్ధతకు కాపలాగా ఉండాల్సిన జిల్లా స్థాయి కార్యాలయంలోనే డాక్యుమెంట్ కో రేట్ల పేరిట వసూళ్ల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రతి డాక్యుమెంట్‌కు ముందే ఒక రేటు ఖరారు చేసి, డాక్యుమెంట్ రైటర్లు–దళారుల అడ్డుపెట్టుకుని అధికారులు అవినీతి దందాను సాగిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ చేయాల్సిన కార్యాలయమే ఆరోపణల కేంద్రంగా మారడంతో కిందిస్థాయి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న వ్యవహారాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూములు, ఇళ్లు, ఆస్తుల లావాదేవీలు, రుణ పత్రాలు, ఒప్పందాల నమోదు మాత్రమే కాకుండా తనిఖీలు, అప్పీల్స్ విచారణ, ఫిర్యాదుల పరిశీలన వంటి కీలక బాధ్యతలు ఉన్న జిల్లా కార్యాలయంపైనే అక్రమ వసూళ్ల ఆరోపణలు రావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పెరిగిన భూమి ధరలు… పెరిగిన వసూళ్ల రేట్లు?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూముల ధరలు భారీగా పెరగడంతో ప్లాట్ల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. ఇదే అవకాశంగా తీసుకుని రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో అక్రమ వసూళ్లు పెరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్ కో రేటు పేరుతో చట్టబద్ధ ఫీజులకు మించి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు నేరుగా కార్యాలయానికి వెళ్తే సాంకేతిక లోపాలు, చిన్నచిన్న కారణాలతో ఫైళ్లను పెండింగ్‌లో పెడుతుండగా… మధ్యవర్తులు లేదా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళ్లే పనులు మాత్రం చకచకా పూర్తవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. భూముల ధరలు పెరిగిన కొద్దీ కార్యాలయంలో వసూళ్ల రేట్లు కూడా పెరుగుతున్నాయన్న సమాచారం గుప్పుమంటోంది.
రిజిస్ట్రేషన్ కావాలంటే ముట్టజెప్పాల్సిందే
రియల్‌ఎస్టేట్, డాక్యుమెంట్ రైటర్ల చేతుల్లోనే కార్యాలయంలో మాముళ్ల వ్యవహారం నడుస్తోంది. ప్రతి రిజిస్ట్రేషన్ ఫైలుకు ముందే ఒక రేటు నిర్ణయించి, ఆ మొత్తం అందితేనే పని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. సామాన్యులు నేరుగా వెళ్తే రోజుల తరబడి తిప్పుకుంటుండగా… మధ్యవర్తుల ద్వారా వెళ్లే ఫైళ్లకు మాత్రం రెడ్‌కార్పెట్ వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రారంభించాలంటే కనీసం రూ.5,000, అదనంగా ‘ఆఫీస్ ఖర్చులు’ పేరిట మరో రూ.2,000 చెల్లించాల్సిందేనన్న పరిస్థితి నెలకొందని బాధితులు చెబుతున్నారు. కోరినంత ఇవ్వని వారికి ‘సిస్టమ్ డౌన్’, ‘సర్వర్ సమస్య’, ‘రేపు రండి’ అంటూ రోజుకో సాకు చెప్పి కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సింగిల్ విండోలో పూర్తవాల్సిన ప్రక్రియను కావాలనే సాగదీస్తుండడంతో చివరకు విసిగిపోయిన ప్రజలు అడిగినంత ముట్టజెప్పి పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
అక్రమ వసూళ్లతో ప్రభుత్వ ఖజానాకు గండి
భూములు, ఇళ్లు, మార్ట్గేజ్‌లు, వసీయత్‌లు, పవర్ ఆఫ్ అటార్నీ, ట్రస్ట్‌లు, సంస్థల ఆస్తి పత్రాల వంటి కీలక రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాల్సిన జిల్లా కార్యాలయంలోనే అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు ప్రభుత్వ ఆదాయానికి భారీ గండిని మిగుల్చుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. వసూలవుతున్న నగదు అధికారిక రికార్డుల్లో నమోదు కాకపోవడంతో ఖజానాకు నష్టం వాటిల్లుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని వల్ల రిజిస్ట్రేషన్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని అక్రమాలకు చెక్ పెట్టాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



