కాంగ్రెస్ నేతల అప్రజాస్వామిక వైఖరి సిగ్గుచేటు
బీజేపీ కార్యాలయాలపై దాడులను ఖండిస్తున్నాం
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్
కాకతీయ, వరంగల్ సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు బయటపడుతున్న తరుణంలో వాటిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను విస్మరించి బీజేపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం తీవ్రంగా ఖండనీయమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 70 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అవినీతిమయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు చేయనిది లేదని విమర్శించారు. 1975లో దేశంపై అత్యవసర పరిస్థితి విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని గుర్తుచేశారు. తమ అవినీతి బాగోతం బయటపడుతుంటే తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు దిగుతోందని అన్నారు. గత చరిత్ర తెలియని నేటి కాంగ్రెస్ నేతలు నిరసనలు, దాడులు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ విధానాల వల్లే దేశ అభివృద్ధి ఎన్నో దశాబ్దాల పాటు నిలిచిపోయిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఎదుర్కొన్నవారమని, ఇలాంటి దాడులు, నిరసనలు చేస్తే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ సహకరించడంలేదని, ప్రజలు ఇప్పటికే ఆ పార్టీని విస్మరిస్తున్నా కాంగ్రెస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని గంట రవి కుమార్ వ్యాఖ్యానించారు.


