యాప్ ద్వారా యూరియా పంపిణీ
రబీ సీజన్ నుంచి అమలు
మండల వ్యవసాయశాఖ అధికారి వినయ్ కుమార్
కాకతీయ, నర్సింహులపేట : ప్రస్తుత రబీ సీజన్ నుంచి రైతులకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియాను పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయశాఖ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. గురువారం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రైతుల ఆధీనంలో ఉన్న భూమి విస్తీర్ణాన్ని బట్టి మూడు నుండి నాలుగు సార్లు స్లాట్ బుకింగ్ చేసుకొని ఎరువులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మండలంలోని రైతులు ఈ నెల 20వ తేదీ నుంచి యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని, ఎరువుల దుకాణాలు లేదా సహకార సంఘాల నుంచి 24 గంటలలో యూరియాను పొందవచ్చని పేర్కొన్నారు. యాప్ విధానం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన సమయంలో యూరియా అందుబాటులో ఉంటుందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు మౌనిక, కళ్యాణి, బాబు, రైతులు పాల్గొన్నారు.


