పైడిపల్లిలో ఎన్నికల అనంతరం ఉద్రిక్తత
ఆందోళనకారుల రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు
నలుగురు పోలీసులకు గాయాలు.. రెండు వాహనాలు ధ్వంసం
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 17-12-2025న నిర్వహించిన ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తన అనుచరులు, కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓటమి ఫలితాలను అంగీకరించని ఆందోళనకారులు పోలింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తూ బ్యాలెట్ బాక్సుల తరలింపును అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సుమారు రెండు గంటల పాటు ఆందోళనకారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో ఉద్రిక్తత మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రిపై దాడికి యత్నించడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. అనంతరం ఆందోళనకారులు పోలీసు అధికారులపై, పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో నలుగురు పోలీసు అధికారులు గాయపడగా, రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. తదనంతరం బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బందిని పటిష్ట బందోబస్తు మధ్య సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనపై రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ)తో పాటు పోలీసు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘనకు సంబంధించి వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత వ్యక్తులపై రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ డి. రఘు చందర్ స్పష్టం చేశారు. గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు.


